Thursday, October 19, 2017

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి వచ్చిందని దివిటీలు కొట్టి
టపాసుల ధ్వనులతో అలజడి రేపక
నవతను వెలుగుతున్న దీపకాంతిలో
చైతన్యపు తారాజువ్వలు రువ్వమని 
అమావాస్య చీకట్లను వద్దని తరిమేసి
మనిషి మదిలో వెలుగును నింపుతూ
అజ్ఞానపు తిమిరాలను పారద్రోలే తేజాలై
విజ్ఞానపు కిరణాలను విరాజిల్లేలా చేసి
రేపటి లోకంలో దూసుకెళ్ళే రాకెట్లకు
చీకటిలేని అమావాస్యల తీపిని పంచి
పండుగ పరిమళాన్ని రోజూ అందిద్దాం!  

Thursday, October 5, 2017

!!సహనం!!

నీలో నువ్వు దాచుకోలేని నిజాలు
ఇతరులకు చెప్పుకున్నావంటే 
వారు తమలో ఎలా దాచుకోగలరో
తెలుసుకుని తెలివిగా మసలుకో
మనతో అవసరం లేకుండా
మనల్ని ఎవ్వరూ ఇష్టపడరు
నీలోన నీతో తర్కించుకో..
స్వార్థం మనిషి జన్మహక్కు అనుకో 
మన శక్తి కన్నా మన సహనమే
మంచి ఫలితాన్ని ఇస్తుంది చూసుకో!

ఈ వాక్యాలు నా కూతురు రమ్యశ్రీ పై చదువులకు లండన్ వెళ్ళినప్పుడు చెప్పాను..ఇవి తనకు ఎంత వరకూ వర్తించి ఉపయోగ పడ్డాయో తెలియదు కానీ నాకు కాలం మరియు అనుభవం అన్నీ నిజమని నిరూపించాయి "సహనం సత్ఫలితాలను ఇస్తుంది" అనే చివరి వాక్యాలు తప్ప...అప్పుడు తనని చూసుకో అన్నాను నేను ఇప్పటికీ వేచి చూస్తూనే ఉన్నాను!  

Friday, September 29, 2017

!!జై మాతాజీ!!

బతుకమ్మ రావమ్మ బ్రతుకు చల్లగా చూడమని
రకరకాల పూలతో నవరాత్రులు పూజించేటోళ్ళు
నవమాసాలు మోసి బ్రతుకునిచ్చిన అమ్మలను
అత్తమ్మలను రమ్మని పిలిచే వారు కరువాయె  
వృధ్ధాశ్రమాల్లో వదిలేసి పలుకరించైనా రారాయె! 

రోజుకో రకపు పిండివంటతో దేవికి నైవేద్యం పెట్టి 
పనికి జీతాలు పండుగ బోనస్లు కావాలనేటోళ్ళు
రక్తాన్ని పాలుగా చేసి పొత్తిళ్ళ పొదిగి దాచుకుని   
పెంచి పెద్దచేసినోళ్ళ కడుపుకింత తిండి పెట్టరాయె
పైగా ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదని నిందలాయె!

నాలుగు దిక్కులా జైజై మాతాజీ అంటూ కేరింతలు 
దిక్కులేని ఒంటరి మాతాజీల ఎన్నో కన్నీటిగాధలు! 

Wednesday, September 20, 2017

!!గారడీ ఆశలు!!


ఇసుక రేణువులు నీటిలోన మెరిసి 
దూరపు కొండలు నున్నగా కనబడి
కనులకి ముసుగేసి గారడీ చేసాయి!

గమ్యాలు గతులు తప్పి గాభరాపెట్టి
అస్థిత్వాన్ని చింపి చెల్లాచెదురు చేసి
జీవితమంటే ఇదేనంటూ నిలదీసాయి!

బంజరు కలలబీటల్ని కన్నీరుతడిపి  
మనోవాంఛలు మూకుమ్మడై కలబడి
కస్తూరి సుగంధాన్ని కోరుతున్నాయి!

అనుబంధాలు అవసరానికి అల్లుకుని
బంగారులేడిలా మభ్యపెట్టి మసిపూసి
బింబానికి ప్రతిబింబాన్ని జతచేసాయి!  

ఆశచావని విరిగిన మనసు పురివిప్పి
ఒంటరి సామ్రాజ్యపు రాజు రాణి తానని
బూజుల విసనకర్ర విసురుతున్నాయి! 

Monday, September 11, 2017

!!భయానికే భయం!!

భయానికి నా నవ్వంటే ఎంతో భయం
పెదవులపై ఉన్న నవ్వూ దర్పం చూసి 
నా మనసులో దాగి ఉన్న ఆవేదనను  
కష్టనష్టాల్లో కూడా పలుకరించి పోదు!

వ్యధలు ఎన్ని ఉన్నా ఎదలోనే దాచేసి 
పైకి గంభీరంగా నవ్వే నేనంటే కన్నీటికి
తెలియని అసూయా అసురక్షిత భావం 
అందుకే ఏడుపు రమ్మన్నా దరిరాదు!