Friday, February 21, 2014

!!నేనే నా సైన్యం !!

అంతరంగ మధనమే నమ్మిన నా అంగరక్షకుడిగా
నియంత్ర భావావేశాలే కాపాడే కవచకుండలాలుగా

ఆలోచనా ఆయుధాలెన్నో అంబులపొదలో దూర్చి
ఆగి అడుగేస్తు సంధిస్తున్నా అస్త్రాలను ఆచితూచి

నవ్వు మాటున దాగిన వేదనలే నా గూఢాచారులు
ఆత్మస్థైర్య, శ్రమ ఫలితాలే నా ఆయుధకోశాగారాలు

నింగికెగసిన ఆశయాలే చేరుకునే లక్ష్యాలుగా మారి
నిలబెట్టి నిలేస్తున్నాయి నిశ్చల సిపాయిలుగా చేరి

సాహసమే ఊపిరంటూ సహాయపడే సలహాదారుడు
సాధ్యంకానిది లేదంటూ సాగిపోమనే సైన్యాధ్యక్షుడు

సహనాన్నే కాలంపై సంధించబోతున్నా చివరాస్త్రంగా
ఎడతెరపిలేని జీవితరణం చేస్తున్నా నేనే నా సైన్యంగా

Tuesday, February 11, 2014

"నిజమైన ప్రేమ"

ఒకానొక సందర్భంలో నా కూతురు నన్నడిగింది...."నిజమైన ప్రేమ" చాలామందికి ఎందుకు దక్కదని?
సమాధానం తరువాత చెప్తాను ముందు వెళ్ళి తోటలోని కొన్ని అందమైన పెద్ద గులాబీలని కోసుకురమ్మన్నాను.
తోటంతా తిరిగి రెండుగంటల తరువాత తిరిగివచ్చి....తోటలో పూలని చూస్తే అందులో కొన్ని గులాబీలు అందంగా పెద్దగానే ఉన్నాయి, కానీ ఇంకా పెద్దవి అందమైన దొరుకుతాయని తోటంతా తిరిగి వెతికి వెనక్కి వచ్చి చూస్తే....ముందు చూసిన పూలని వేరెవరో కోసేసుకున్నారు అని దిగులుగా చెప్పింది.
అప్పుడు నేనన్నాను....."నిజమైన ప్రేమ" కూడా అంతే, ఎదురుగా ఉన్నప్పుడు అదంటే లెక్క చేయము, కావాలని కోరుకున్నప్పుడు అది వేరొకరి సొంతం అవుతుంది.

Monday, February 3, 2014

వృధాప్రయత్నం

పలకా బలపం పట్టి పదాలెన్నో కూర్చి
పలకలేని భావాలన్నీ అందులో పేర్చి
చదవమంటే సరిగ్గా కనబడడం లేదని
నల్లకళ్ళద్దాలు తొడిగి రంగుకల చూస్తే
కనబడేది నలుపే కాని తెలుపు కాదు..

మూర్ఖుడికి మంచి ముచ్చట్లెన్నో చెప్పి
మురిపాలతో అనురాగ పాఠాలు నేర్పి
గాజువంటి జీవితాన్ని గోముగిస్తే కాదని
విసిరేసి ముక్కలు చేసి గాయాలు చేస్తే
మందువేసినా గాటుమాత్రం మాసిపోదు..

బండబారిన మనసుని బరిలోకి దింపి
ప్రేమనంతా పోసి గోరుముద్దలుగా చేసి
తినిపించబోతే చేదు నోటికి సహించదని
తియ్యతేనెలో విషాన్ని రంగరించి సేవిస్తే
విషం వెన్నగామారి ప్రాణం పోసేయదు..