Friday, June 26, 2015

!!అలసిన బ్రతుకు!!


ఉద్యోగమే చేసి ఉసూరుమని ఇంటికి చేరి అనుకుంటాను
పనిచేయడానికి బ్రతుకుతున్నానా లేక బ్రతకడానికా అని
పసితనంలో తెలియలేదు ఎదిగి ఏమౌవుతావు అనడిగితే
అడిగితే చెప్పాలనుంది మళ్ళీ పసిపిల్లని అవ్వాలనుందని!
నాణెం జీవితాన్ని చూపితే ఖాళీసంచి నా వాళ్ళని చూపింది
సంపాధిస్తే తెలిసే, తల్లిదండ్రుల సంపాదనతోటిదే సంబరాలని
నేను సంపాధిస్తున్నది కేవలం అవసరాలే తీరుస్తున్నాయని
నవ్వు రాకపోయినా నలుగురిలో నవ్వుతూ నటిస్తున్నానని
క్షేమమా అనడిగితే లేకపోయినా కుశలమే అంటున్నానని!! 

జీవితమా అలసిపోయాను! లెక్కలుంటే చూసి పంపించేయి
బాకీలు బంధాలు ఏమైనా మిగిలుంటే మాఫీ చేసి కొట్టేయి!!

Monday, June 15, 2015

!!నీ ఇష్టం!!

మనసు ఎరుగని రకరకాల మనస్తత్వలు
మెండుగున్నాయి...
మంట లేకుండానే మదిలో మంటలు రేపి
మండుతుంటాయి...
పలకరిస్తే చాలు భాధలే కాక పతనమైన
గాధలు వినిపిస్తాయి...
ఎవరికి ఎవరూకాని నీకు వారు పరాయి,
వారికి నీవు పరాయి...
అయినా పద్ధతులని చెప్పి పరామర్శలతో
ప్రళయం సృష్టిస్తాయి...
ఈ సమాజంలో ఎవరికివారే ప్రత్యేకం 
అనుకోవడం లేని బడాయి...
అందుకే అందరూ చెప్పే నీతులు విని,
మనసుకి నచ్చింది చేసేయి...
ఆ పై నచ్చలేదనుకుంటే జీవించడానికి
మరిన్ని సాకులు వెతికేయి!

Monday, June 8, 2015

!!బ్రతుకు!!

పని చేస్తే ఒక గుర్తింపు, అడుగేస్తే గుర్తు పడనీయి

బ్రతుకుదేముంది బజారులో కుక్కా బ్రతుకుతుంది

జీవిస్తే నీ చరిత్రని కలకాలం గుర్తుగా ఉండిపోనీయి

తల్లికి కూడెట్టక అమ్మోరికి దీపధూపనైవేధ్యాలు పెట్టి

భక్తిలో అమ్మనేం చూసేవు తల్లిలో దైవాన్ని చూసేయి

గది తీసుంటేనే లోనున్నది బొగ్గో బంగారమో తెలిసేది

మనిషి అన్నీ ఉన్న అంగడైతే మాటనే తాళం వేసేయి

కాలమే నిర్ణయిస్తుంది ఎవరికి ఎంత ప్రాప్తమో అన్నది

పనికొచ్చే నలుగురిని ఉంచి పనికిరాని వందా వదిలేయి

సంతోషమే సిరి ఆత్మవిశ్వాసమే ఎవరు దోచుకోలేని నిధి

ఆరోగ్యమే అంతులేని సంపద అని గుర్తు ఉంచుకోవోయి!!

Friday, June 5, 2015

కొన్నిసార్లు


కొన్నిసార్లు...ఆశల పై అంచనాలు అధికంగా వేసి  
మన మనోవేధనకి మనమే కారణం అవుతాము!

పలుమార్లు...ఆత్మస్థైర్యంతో భాధని నవ్వుతూ గెలిచి 
ఒంటరిపోరాటంతో అనుకున్నవి కొన్నైనా సాధిస్తాము! 

చాలాసార్లు...అసలు విషయం ఏమిటనేది వదిలివేసి 
మన దృష్టితో అంచనా వేసి హైరానా పడుతున్నాము! 

ఎన్నోమార్లు...రాయి విసిరినంత సులువుగా భాధపెట్టి 
గాయం లోతెంతో చూడకనే మన్నించమని కోరుతాము! 

అనేకసార్లు...సంపద పోతే సర్వం పోయిందని ఏడ్చి
ధైర్యం కోల్పోయి అసలు జీవితాన్నే కోల్పోతున్నాము!