Wednesday, April 13, 2016

!!నా తోడు!!

నా ఉనికిని తెలిపే అస్తిత్వపు అద్దం
ఎందుకో తెలియకుండా ముక్కలైపోయె
నలుగురిలో ఒంటరిగా నడుస్తుంటే
చుట్టూ లోకం ఎందుకో వింతగా తోచె
గాజువంటి మనసు ముక్కలై చెల్లాచెదురైతే
గుచ్చుకుంటాయన్న భయంతో తీయలేదు ఎవరూ..
నిజం చెబితే తెగిపోతాయి కొన్ని బంధాలు
అబద్ధమాడితే నాకు నేనే తెలియకుండా విరిగిపోతాను!
ఇది యాధృచికం అనుకో వ్యధతో కూడిన నిజమనుకో
కంటనీరిడిన ప్రతీసారీ నా అనుకున్నవారే కారణమై
ఈ జీవితం అంతులేని వింతకధగా అనిపించె
కోరుకున్నవి అన్నీ చేయి జారిపోయాయి..
జనాన్ని నవ్వించాలని నవ్వుతున్నానే తప్ప
లేకపోతే లోకాన్ని నీట ముంచేంత కన్నీరు నాలో దాగుంది!
ఆశ ఏదైనా ఉందంటే అది కేవలం నా కన్నీటి పైనే
అవి నేను బాధపడితే ఖచ్చితంగా మద్దతునిస్తాయి..

Sunday, April 10, 2016

!!విచిత్రం!!

ఎంత చిత్ర విచిత్రమో కదా...
కళ్ళు ఊటబావి కాకపోయినా
బాధలో నీరు ఉబికి వస్తుంది.
శత్రుత్వం విత్తు కాకపోయినా
పగకి మదిలో బీజం వేస్తుంది.
పెదాలు వస్త్రం కాకపోయినా
మాటమీరితే కుట్లు వేయాల్సింది.
అదృష్టం ఆలి కాకపోయినా
అప్పుడప్పుడూ అలుగుతుంది.
జ్ఞానం లోహం కాకపోయినా
ఆలోచించకపోతే జంగు పడుతుంది.
ఆత్మగౌరవం శరీరం కాకపోయినా
గాయపడి వేదన చెందుతుంది.
మనిషి ఏ ఋతువు కాకపోయినా
అవసరాన్నిబట్టి మారిపోతుంటాడు!!

Tuesday, April 5, 2016

!!సత్యం!!

తియ తీయగా మాట్లాడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు
ఉన్నది ఉన్నట్లు ఉప్పగా చెప్పేవారు చెడ్డవారూ కాదు
గమనిస్తే..ఉప్పుతో చేర్చిన పదార్ధాలు నిలువ ఉంటాయి
తీపిపదార్థాల పై క్రిములు వాలి పనికిరాకుండా పోతాయి!

Saturday, April 2, 2016